భవానీపూర్‌లో మమతా బెనర్జీకి భారీ షాక్.. సువేందు అధికారి చేతిలో ఓటమి

  • భవానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమి
  • బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో రెండోసారి పరాజయం
  • గతంలో నందిగ్రామ్‌లోనూ మమతను ఓడించిన సువేందు
  • ఈ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి రెండింటిలోనూ గెలిచిన సువేందు అధికారి
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన సొంతగడ్డ భవానీపూర్‌ నియోజకవర్గంలో ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఆమె పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారంగా ఈసారి భవానీపూర్‌ నుంచి బరిలోకి దిగినా, ఫలితం మారకపోవడం గమనార్హం.

ఎన్నికల సంఘం వెల్లడించిన ఫలితాల ప్రకారం, సువేందు అధికారికి 73,917 ఓట్లు రాగా, మమతా బెనర్జీకి 58,812 ఓట్లు మాత్రమే లభించాయి. దీంతో 15,105 ఓట్ల మెజారిటీతో సువేందు అధికారి ఘన విజయం సాధించారు. సువేందు చేతిలో మమత ఓడిపోవడం ఇది వరుసగా రెండోసారి. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో జరిగిన హోరాహోరీ పోరులోనూ సువేందు చేతిలోనే ఆమె ఓటమి పాలయ్యారు.

మరోవైపు, సువేందు అధికారి ఈ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి, రెండింటిలోనూ గెలుపొంది రికార్డు సృష్టించారు. భవానీపూర్‌తో పాటు నందిగ్రామ్ నియోజకవర్గంలోనూ పోటీ చేయగా, నందిగ్రామ్ లో తృణమూల్ అభ్యర్థి పబిత్ర కర్ పై 9,665 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. ముఖ్యమంత్రిపై వరుసగా రెండుసార్లు గెలవడం, రెండు నియోజకవర్గాల్లోనూ జయకేతనం ఎగురవేయడంతో సువేందు అధికారి బెంగాల్ రాజకీయాల్లో మరింత బలమైన నేతగా అవతరించారు. బెంగాల్ సీఎం రేసులో సువేందు అధికారి ముందున్నారు. 

Mamata Banerjee
Bhabanipur
Suvendu Adhikari
West Bengal Elections
TMC
BJP
Nandigram
Political News
Indian Politics
Election Results

More Telugu News